నమస్తే శేరిలింగంపల్లి: నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ ఆండ్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ బుదవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ ట్రానిక్ రూ.1200 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్, ఆవిష్కరణలు చేయనుందని అన్నారు. దీని ద్వారా హెల్త్‌కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్ పనిచేస్తున్నదని, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్నదని. నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా ప్రారంభంలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. మెడ్‌ట్రానిక్ సంస్థ అమెరికా తర్వాత హైదరాబాద్‌లో తన అతిపెద్ద పరిశోధన & అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కలిసొచ్చే అంశమని అన్నారు.