మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాసుతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య సభ్యులు రాజేంద్రనగర్ ఆర్డిఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సమాఖ్య కార్యదర్శి అంగడి పుష్ప మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను అమాంతం పెంచుతూ పోతుందన్నారు. గ్రామీణ రైతు, కార్మిక ప్రజలతో పాటు ఉద్యోగ వర్గాల ప్రజలు ప్రతినిత్యం పెరుగుతున్న ధరలతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పేద మధ్యతరగతి ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంపొందింపజేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని తెలిపారు. బడా కార్పొరేట్ సంస్థలకు ఋణమాఫీ చేస్తూ పేదలపై ఆ భారాన్ని మోపడం సరికాదని, వెంటనే నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో మహిళలు కళావతి, రాణి, అనిత, విమల, పుష్పలత, ఇందిర తదితరులు ఉన్నారు.
