మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో మత సామరస్యం వెల్లివిరిసింది. మియాపూర్ వాస్తవ్యులు, టీఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకులు, ఎపెక్స్ ప్రాపర్టీస్ అధినేత ఎండి అన్వర్ షరీఫ్ అయోధ్యలోని శ్రీ భవ్య రామమందిర నిర్మాణానికి తనవంతుగా రూ.1 లక్ష నిధి సమర్పణ చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర నిధి సమర్పణ్ అభియాన్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, ఆర్ఎస్ఎస్ కుకట్‌పల్లి భాగ్ సహకార్యవాహ్ యాదగిరి, బిజెపి రంగారెడ్డి జిల్లా(అర్భన్) ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, సీనియర్ నాయకులు తోపుగొండ మహిపాల్‌రెడ్డిలు శుక్రవారం తన కార్యాలయంలో అన్వర్ షరీఫ్‌ను కలిశారు. అయోధ్యలో చేపట్టనున్న భవ్య రామమందిర నిర్మాణ ప్రాధాన్యత, ప్రణాళికను వారికి వివరించారు.
స్పందించిన అన్వర్ షరీఫ్ మాట్లాడుతూ రాముడి కోసం హిందు సోదరులు పడే తాపత్రయం అర్థం చేసుకోవాల్సిందేనని అన్నారు. దశాబ్దాల సమస్య సామరస్యంగా పరిష్కారం అయ్యిందని, మందిరం అత్యద్భుతంగా నిర్మిస్తే కుల మతాలకు అతీతంగా రామ భక్తులు సందర్శిస్తారని అన్నారు. దేశాభివృద్ధికి స్పీడ్ బ్రేకర్‌గా ఉన్న జఠిల సమస్యను సుప్రిం కోర్ట్ పరిష్కరించడం చరిత్రాత్మక ముందడుగని అన్నారు. రాముడి జీవనం అందరికి ఆదర్శమని, అలాంటి రాముడి జన్మభూమి అన్ని మతాల వారికి సందర్శనీయ స్థలం కావాలని అన్నారు. అందుకోసం ఉడతా భక్తిగా తనవంతు రూ.1 లక్ష నిధి సమర్పిస్తున్నట్టు తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్వర్ షరీఫ్ ముందుకు వచ్చి పెద్ద మొత్తంలో నిధి సమర్పణ చేయడం అభినందనీయంటూ నేతలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ సేవకులు పుట్ట వినయకుమార్ గౌడ్, అందెల కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.