మ‌నీ స‌ర్క్యులేష‌న్ స్కీమ్ ల ప‌ట్ల జాగ్ర‌త్త.. హెచ్చ‌రించిన సైబ‌రాబాద్ పోలీస్‌..

సైబ‌రాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మ‌నీ స‌ర్క్యులేష‌న్ స్కీమ్‌ల పేరిట ఎవ‌రైనా ఆశ‌పెడితే న‌మ్మొద్ద‌ని, అలాంటి స్కీమ్‌ల‌లో డ‌బ్బులు పెట్టి మోసపోవ‌ద్ద‌ని సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ హెచ్చ‌రించారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. క్యూఐ గ్రూప్ కంపెనీల‌కు చెందిన క్యూనెట్ అనే కంపెనీ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ పేరిట గ‌తంలో మ‌నీ స‌ర్క్యులేష‌న్ స్కీమ్ ల‌ను నిర్వ‌హించింద‌ని తెలిపారు. క్యూఐ గ్రూప్ కంపెనీల‌ను 1998లో హాంగ్ కాంగ్‌లో విజ‌య్ ఈశ్వ‌ర‌న్ అలియాస్ దాతో ఈశ్వ‌ర‌, జోసెఫ్ బిస్‌మార్క్ స్థాపించాడ‌న్నారు.

 

గ‌తంలో వీరు దేశంలో జాతీయ స్థాయిలో ప‌లు మ‌నీ స‌ర్క్యులేష‌న్ స్కీమ్ ల‌ను నిర్వ‌హించార‌ని, వాటిల్లో డ‌బ్బు పెట్టుబ‌డి పెడితే 30 రోజుల్లో ఆస‌క్తిక‌ర‌మైన రిట‌ర్న్స్ ఇస్తామ‌ని చెప్పేవార‌న్నారు. అయితే త‌మ మీద ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగించ‌డం కోసం వీరు కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌ను మాత్ర‌మే ఈ స్కీంలో చేర్పించాల‌ని సూచించేవార‌ని అన్నారు. దీంతో ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌ర‌ని ఈ కంపెనీ ఉద్దేశ‌మ‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఈ కంపెనీ అప్ప‌ట్లోనే రూ.20వేల కోట్ల స్కాం చేసింద‌న్నారు.

అయితే ఇటీవ‌ల ఈ కంపెనీ మ‌ళ్లీ మారు పేర్ల‌తో అంత‌ర్జాతీయ కంపెనీగా న‌మ్మిస్తూ మ‌ళ్లీ మ‌నీ స‌ర్క్యులేష‌న్ స్కీమ్ ల‌ను నిర్వ‌హిస్తుంద‌ని, ఇక ఈసారి 7 రోజుల్లోనే పెట్టుబ‌డి పెట్టిన డ‌బ్బుల‌ను ఇస్తామ‌ని చెబుతున్నార‌ని అన్నారు. అందువ‌ల్ల ప్ర‌జ‌లు ఈ విష‌యంపై జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. ఇలాంటి మ‌నీ స‌ర్క్యులేష‌న్ స్కీమ్ ల‌లో చేరి డ‌బ్బులు పెట్టుబ‌డి పెట్టి న‌ష్ట‌పోవ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు ఇలాంటి వారు తార‌స ప‌డితే స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని లేదా EOW Cyberabad Whatsapp number 9493625553 లోనూ సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచించారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here