గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ లో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భాగ్యనగర అర్చక పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీనివాసాచార్యులు బృందం ఆధ్వర్యంలో 11వ కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయాలలో దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. దేశ ప్రజలకి ఎలాంటి ఆపద రాకుండా అందరికీ మంచి జరగాలనే ఒక మంచి సంకల్పంతో 41 రోజుల సీతారాముల కల్యాణ మహోత్సవం దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా నేతాజీ నగర్ కాలనీ షిరిడి సాయిబాబా ఆలయంలో 11వ కల్యాణాన్ని ఘనంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. శ్రీ సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకుడు జోషి రాఘవేంద్ర శర్మ పర్యవేక్షణలో ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో భగవంతుని కరుణ కటాక్షాలు పొంది జీవించాలని అన్నారు.
కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముడి మందిరం నిర్మాణం కోసం శ్రీ రామ మందిరం ట్రస్టు అకౌంట్‌కు నిధులను ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగిందన్నారు. ఆలయ నిర్మాణంలో మనందరం భాగస్వాములు కావడం మన పూర్వజన్మ సుకృతం అని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరు కులమతాలకతీతంగా శ్రీరాముని మందిరం నిర్మాణంలో తమకు తోచినంత విరాళాలు ఇచ్చి అందరం ఆలయ నిర్మాణంలో భాగస్వాములం కావాలని కోరారు. ఈ పూజా కార్యక్రమంలో సాయి సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.