- దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన న్యాయస్థానం

నమస్తే శేరిలింగంపల్లి: తమ ఇంటి గుట్టు బయట పెట్టారనే అనుమానంతో ఓ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు నిందితులు. దీనికి ఇతర ఆస్తి వివాదాలు తోడవ్వడం తో సదరు కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన అభం శుభం తెలియని నాలుగేళ్ళ చిన్నారిని దారుణంగా హత్య చేసి చివరకు కటకటాల పాలయ్యారు. ఘటన జరిగిన ఐదేళ్ల అనంతరం ప్రధాన నిందితుల్లో ఇద్దరు మృతి చెందగా ఓ మహిళకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు నేరానికి సహకరించిన మరో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీసులు మీడియాకు వెల్లడించారు.
సనత్ నగర్ పరిధిలోని దీనదయాల్ నగర్ లో యూ.లక్ష్మయ్య, యాదమ్మ లు నివాసముండే వారు. వీరి కుమారుడు నర్సింలు(36), కుమార్తె పద్మ(32)లు ఉన్నారు. వీరి ఇంటి సమీపంలో రవ్వల యాదగిరి(42) ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ ఉండేవాడు. కాగా యాదగిరి పద్మతో వివాహేతర సంబంధం పెట్టుకోగా ఈ విషయం స్థానికంగా ప్రచారం జరిగింది. కాగా ఈ విషయాన్ని స్థానికంగా నివాసముండే ఓ కుటుంబ సభ్యులు ప్రచారం చేశారని లక్ష్మయ్య, యాదమ్మ కుటుంబ సభ్యులు అనుమనించారు. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. రవ్వల యాదగిరికి సైతం సదరు కుటుంబంతో ఓ ప్లాట్ విషయంలో వివాదం కొనసాగుతోంది. వీరంతా సదరు కుటుంబంపై కక్ష పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మయ్య, యాదమ్మ, పద్మ లు 2015 అక్టోబర్ 14వ తేదీన ఆ కుటుంబంలోని నాలుగేళ్ళ చిన్నారిని చంపేందుకు పథకం వేశారు. చిన్నారి బయట ఆడుకుంటుండగా ఎవరూ చూడని సమయంలో ఇంట్లోకి తీసుకువచ్చారు. తీవ్రంగా కొట్టి మెడ చుట్టూ గుడ్డ చుట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఈ విషయాన్ని నర్సింలు, యాదగిరి లకు వివరించగా, వారు చిన్నారి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ప్లాస్టిక్ సంచులలో మూట కట్టారు. రెండు రోజుల అనంతరం ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదుతో విషయం వెలుగు లోకి వచ్చింది.
న్యాయస్థానంలో కేసు కొనసాగే క్రమంలోనే లక్ష్మయ్య, యాదమ్మ లు మృతి చెందగా ఫిబ్రవరి 1వ తేదీన ఎల్ బి నగర్ 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి ఎన్. ప్రేమలత ప్రధాన నిందితురాలైన పద్మకు యావజ్జీవ శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా, యాదగిరి, నర్సింలు లకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు.





