నమస్తే శేరిలింగంపల్లి: నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఓ మహిళ మృతికి కారణమయ్యాడు ఓ టిప్పర్ డ్రైవర్. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని గమనించకుండా వేగంగా టిప్పర్ తోలడంతో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
మహబూబ్‌నగర్ జిల్లా నందిపహాడ్ గ్రామానికి చెందిన మైముద్, భార్య నూర్జహాన్ బేగం(45)తో కలిసి శేరిలింగంపల్లి గోపీనగర్ లో నివాసముంటూ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా బుధవారం ఉదయం మైముద్, నూర్జహాన్‌లు తమ ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తూ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగారు. గ్రీన్ సిగ్నల్ పడిన వెంటనే మైముద్ విప్రో సర్కిల్ వైపుగా ద్విచక్రవాహనాన్ని తిప్పాడు. అప్పటికే ట్రాఫిక్ లో నిలిచి ఉన్న టిప్పర్ TS07UE6610 డ్రైవర్ వీరిని గమనించకుండా అదే వైపు వాహనాన్ని తిప్పి ద్విచక్రవాహనాన్ని డీకొట్టాడు. ఈ ఘటనలో మైముద్ బైక్‌తో ఎడమ ప్రక్క పడిపోగా, నూర్జహాన్ కుడివైపు పడిపోయిది. విషయం గమనించని టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో నూర్జహాన్ చాతిమీదుగా టిప్పర్ టైర్లు వెళ్లడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో మైముద్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.