- శేరిలింగంపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు
మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ఓటర్లు అందించిన స్పూర్తితోనే నేడు టిఆర్ఎస్ నాయకులు మేయర్ పీఠంపై ఉన్నారని, ఇదే స్పూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాభి జెండా ఎగురవేయడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ నరేన్ గార్డెన్స్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గ టిఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, శ్రీ భూపాల్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, ప్రభుత్వవిప్ ఆరెకపూడి గాంధీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ బిజెపి అభ్యర్థి రామచంద్రారావు ఎమ్మెల్సీగా గెలిచిన అనంతరం 2018 లో ఎమ్మెల్యే స్థానానికి, 2019లో ఎంపి స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడని, ఆయనకు తనను ఎమ్మెల్సీగా గెలిపించిన పట్టభద్రులపై గౌరవం లేదా అని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలతో ప్రజలు బిజెపి పై వ్యతిరేకంగా ఉన్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇచ్చిన హామీలను ఎక్కడా నిలబెట్టుకోలేదని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక మహిళ సురభి వాణీ దేవికి మహిళలంతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు, అభివృద్ధిని ప్రతిఒక్క పట్టభద్రులకు తెలిపి,వారిని స్వయంగా కలిసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం రానున్న 15రోజులు ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలాగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా ఆయా కుటుంబాల్లోని గ్రాడ్యుయేట్లు గుర్తించేలా ముందుకు పోవాలి అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పాతురి సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్లు హమీద్ పటేల్ , జగదీశ్వర్ గౌడ్ , దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నే శ్రీనివాస రావు, పూజిత గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి, రోజాదేవి రంగరావు , మంజుల రఘునాథ్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ సాయిబాబా, తెరాస నాయకులు , కార్యకర్తలు, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.