నమస్తే శేరిలింగంపల్లి: ఒకవైపు తెలుగు భాషను… మరోవైపు హైదరాబాద్ వంటకాలను ప్రోత్సహిస్తూ పోస్టల్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తపాల బిల్లలతో తెలుగు వర్ణమాల పుస్తకాలను రూపొందించింది. పిల్లలు, పెద్దలు తెలుగు నేర్చుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం ధరను రూ.200(హార్డ్ బైండింగ్), రూ.100(పేపర్ బ్యాక్)గా నిర్ణయించారు. ఈ పుస్తకాన్ని పోస్టల్ శాఖ కార్యదర్శి ప్రదీప్త కుమార్ బిసోయి డిల్లీనుంచి ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు. అదేవిధంగా హైదరాబాద్ వంటకాలలో ప్రత్యేకమైన మిర్చీకా సాలన్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఉస్మానియా బిస్కెట్లు, డబుల్ కా మీటా, షాహి తుక్డా, హైదరాబాద్ హలీమ్, కుబాని కా మీటా, పత్తర్ కా గోష్, భగారా బైగన్, తలా ఉహా గోష్, శిఖంపురి కబాబ్ చిత్రాలతో కూడిన పోస్ట్ కార్డులను సైతం రూపొందించింది.
ఈ పోస్ట్ కార్డులను హైదరాబాద్ ఢాక్ సదన్‌లో తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ ఆవిష్కరించారు. పోస్ట్ కార్డుల ధర రూ.140, రూ.200లుగా నిర్ధారించినట్టు వారు తెలిపారు. పోస్టల్ స్టాంపులతో కూడిన తెలుగు వర్ణమాల పుస్తకం, అదేవిధంగా హైదరాబాద్ వంటకాలతో కూడిన( పోస్ట్ కార్డులు హైదరాబాద్‌లోని జీపీలో, అదేవిధంగా హెడ్ పోస్ట్ ఆఫీస్‌లలో లభిస్తుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌పిఎస్ గొర్లి శ్రీనివాస రావు, పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పివిఎస్ రెడ్డి, పోస్టల్ అకౌంట్స్ డైరెక్టర్ సాయి పల్లవి తదితరులు పాల్గొన్నారు.