నమస్తే శేరిలింగంపల్లి: నడుచుకుంటూ వెళ్తున్న ఒక వృద్ధుడు ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న ఒక సైట్ గుంతలో పడి మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఖానామెట్ వీకర్ సెక్షన్ కాలనీ కి చెందిన కైలే మరియ దాసు(60) రిటైర్డ్ ఉద్యోగి. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఖానామెట్ లోని అరవిందో సంస్థ నిర్మాణం గుంతలో పడి మృతి చెంది ఉండడాన్ని గుర్తించిన సదరు సిబ్బంది మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించారు. అరవిందో సైట్ పక్క నుంచి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గుంతలో పడి ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.