- హైదరాబాద్ ఆటగాడిని కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టు
నమస్తే శేరిలింగంపల్లి: ఐపీఎల్ మెగా వేలంలో శేరిలింగంపల్లికి చెందిన క్రికెటర్ తిలక్ వర్మ జాక్‌పాట్ కొట్టేశాడు. ఈ యువ ఆటగాడి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడ్డాయి. చివరకు ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను ఊహించని ధరకు దక్కించుకుంది. ఒకవైపు అండర్ -19 టీం కెప్టెన్ యశ్ ధుల్ రూ.50 లక్షలకు అమ్ముడు పోగా, తిలక్ వర్మ ఏకంగా రూ.1.7 కోట్లు ధర పలకడం క్రికెట్ క్రీడాకారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
పీజేఆర్ స్టేడియంతో మొదలై… లేగల క్రికెట్ అకాడమీతో రాణిస్తూ…
శేరిలింగంపల్లిలో నివాసం ఉండే తిలక్ వర్మ పూర్తి పేరు నంబూద్రి ఠాకూర్ తిలక్ వర్మ. 2002 నవంబర్ 8న హైదరాబాద్ లో పుట్టాడు. మొదట చందానగర్ పీజేఆర్ స్టేడియంలో కోచ్ సలాం శిక్షణలో తిలక్ వర్మ క్రికెట్ మంచి ప్రావీణ్యం సంపాదించాడు.అనంతరం అదే కోచ్ నేతృత్వంలో లింగంపల్లిలోని లేగల క్రికెట్ అకాడమీలో మెరుగైన శిక్షణ పొందుతున్నాడు. 2018-19 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 15 టీ ట్వంటీల్లో 381 పరుగులు చేసిన తిలక్ వర్మ లిస్ట్ ఎ క్రికెట్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తిలక్ వర్మ 180 పరుగులు చేశాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు.
తిలక్ వర్మ ఇప్పటి వరకు లిస్ట్-ఏ లో 16 మ్యాచ్‌లు ఆడి 784 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 156. బ్యాటింగ్ యావరేజ్ 52.26. లిస్ట్-ఏ, దేశవాళీ, టీ20 మ్యాచ్‌లల్లో భారీ స్కోర్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం టీమిండియా అండర్-19లో బ్యాటింగ్ బ్యాక్‌బోన్‌గా గుర్తింపు పొందాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు బెంగుళూరు వేధికగా జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు తిలక్‌ను రూ.1.70 కోట్లకు దక్కించుకుంది. తిలక్‌వర్మకు భారీ ధర లభించడంపై అతని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజకీయ, క్రీఢా ప్రముఖులు తిలక్ వర్మను, అతని కోచ్ సలాంలో అభినందించారు.