శేరిలింగంపల్లిలో సచిన్ టెండూల్కర్ సందడి…

  • ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ నివాసానికి తోటి జట్టు సభ్యులు
  • లేగల క్రికెట్ గ్రౌండ్స్ ను సందర్శించిన సచిన్, అర్జున్ టెండూల్కర్లు
  • తిలక్ వర్మ కోచ్ సలాంను అభినందించిన భారతరత్న

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండుల్కర్ తో పాటు ముంబై ఇండియన్స్ క్రికెట్ టీం సభ్యులు సోమవారం రాత్రి శేరిలింగంపల్లిలో పర్యటించారు. హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మంగళవారం క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పలువురు క్రీడాకారులు నగరానికి చేరుకున్నారు. కాగా ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కుటుంబ సభ్యులను కలిసేందుకు సచిన్ టెండూల్కర్ తో పాటు ముంబై ఇండియన్స్ టీం సభ్యులు శేరిలింగంపల్లికి విచ్చేశారు. బెల్ ఎంఐజి లోని తిలక్ వర్మ నివాసంలో వారి తల్లిదండ్రులు నంబూరి నాగరాజు, గాయత్రి దంపతులు, అదేవిధంగా కోచ్ సలాంను సచిన్ టెండూల్కర్ ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్ జట్టు కేప్టన్ రోహిత్ శర్మ, జట్టు సభ్యులు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పియూష్ చావ్లాలు మర్యాదపూర్వకంగా కలిశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

తిలక్ వర్మ నివాసంలో వారి తల్లిదండ్రులు నంబూరి నాగరాజు, గాయత్రి, కోచ్ సలాంతో సచిన్ టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పియూష్ చావ్లా

అనంతరం సచిన్ టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్ లు తిలక్ వర్మ శిక్షణ పొందుతున్న లింగంపల్లి గ్రామంలోని లేగల క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్ ను సందర్శించారు. తిలక్ వర్మను జాతీయస్థాయి క్రికెటర్ గా తీర్చిదిద్దిన తన వ్యక్తిగత కోచ్ సలాంను సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా అభినందించారు. తిలక్ వర్మ లాంటి షార్ప్ ఆటగాళ్లు భారత జట్టుకు ఎంత అవసరమని కితాబిచ్చారు. అయితే సచిన్ టెండూల్కర్ బృందం శేరిలింగంపల్లి పర్యటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

లింగంపల్లిలోని లేగల క్రికెట్ అకాడమీ గ్రౌండ్ ను సందర్శిస్తున్న సచిన్ అర్జున్ టెండూల్కర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here