– చెరువులకు గండి – నీట మునిగిన కాలనీలు
– నదులను తలపించిన దారులు – చేపలు పట్టిన జాలర్లు
– సకాలంలో స్పందించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు
– ప్రజలను బయటకు రావద్దంటు ప్రభుత్వ విప్ గాంధీ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శేరిలింగంపల్లిని వరదనీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలన్ని పూర్తిగా జలమయమయ్యాయి. గోపిచెరువు అలుగుకు గండి పడటంతో లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జీ కిందనుంచి నదిని తలపించేలా వరదనీరు ఉప్పొంగింది. దీంతో లింగంపల్లి, తారానగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అటు ప్రకాష్ నగర్ కొత్తకుంటకు గండి పడటంతో మదీనగుడ పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నియోజకవర్గంలో అన్ని డివిజన్‌లలో ఇదే పరిస్థితి నెలకొంది. కాగా ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం తప్పింది. కానుకుంట నాలాలో మంగళవారం అర్ధరాత్రి బైక్‌తో సహా నాలాలో కొట్టుకుపోయినట్టు బావించిన ఇద్దరు వ్యక్తులు చందానగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బైక్ మాత్రమే వరదలో కొట్టుకుపోయిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఐతే అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని వారు పిలుపునిచ్చారు.