శేరిలింగంపల్లిలో అర్ధరాత్రి వర్ష బీభత్సం

జనప్రియ అపార్ట్మెంట్ తొమ్మిదవ బ్లాకులో కారుపై కూలిన భారీ వృక్షం

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం దినమంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అర్ధరాత్రివేళ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా మదినగూడ, లింగంపల్లి, తారానగర్, మియాపూర్ న్యూ కాలనీ, హఫీజ్ పేట్, జనప్రియ కాలనీ, అపార్ట్మెంట్స్ తదితర ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. ఎక్కడికక్కడ ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో నివాసితులు అవస్థలు పడ్డారు. చాలా చోట్ల చెట్లు విరిగి పడడం, రహదారుల పైకి పెద్ద యెత్తున నీరు చేరడంతో రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.

తారానగర్ లో పార్క్ చేసిన బైకులు పూర్తిగా నీట మునిగిన దృశ్యం

బైక్ తో సహా నాలాలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు..?
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం… లింగంపల్లి చౌరస్తాలోని ప్రీతి యూరాలజీ హాస్పిటల్ నుండి కానుకుంట నాలా మీదుగా బిఆర్ గ్యాస్ పైపు ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వెళ్తూ వరద ఉధృతికి నాలాలో కొట్టుకుపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చందానగర్ పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో వాహనదారులు కొట్టుకుపోతున్న ఫుటేజీ ఏదైనా లభిస్తుందేమో అనే కోణంలో ప్రయత్నం చేస్తున్నారు. సదరు వాహనదారులు ఎక్కడివరకు కొట్టుకుపోయారో తెలియని పరిస్థితి.

కానుకుంట నాలా వద్ద బైక్ తో సహా ఇద్దరు వ్యక్తులు నాలాలో కొట్టుక పోయినట్టు స్థానికులు పేర్కొంటున్న ప్రదేశం(రెడ్ మార్క్)

నీటమునిగిన కాలనీలు…
మియాపూర్ న్యూ కాలనీ, వీడియో కాలనీ, మదినగూడ సత్యనారాయణ ఎంక్లేవ్, లింగంపల్లి వెంకట్ రెడ్డి కాలనీ, తారానగర్ మార్కెట్ ఏరియా తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ఒక వైపు భారీ వర్షం, మరోవైపు ఇళ్ళ లోకి చేరిన వరద నీటితో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

తారానగర్ లో ఇళ్లల్లోకి చేరిన నీటిలో తేలియాడుతున్న సోఫాలు

కార్లపై కూలిన చెట్లు…
గంగారం మంజీరా రోడ్ లో, జనప్రియ అపార్ట్మెంట్స్ 9వ బ్లాక్ లలో కార్లపై చెట్లు కూలాయి. కాగా సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా లింగంపల్లి రైల్వే స్టేషన్ ముందు భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా నేలకూలింది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహన రాకపోకలు స్తంభించాయి.

మంజీరా రోడ్ లో కారుపై కూలిన వృక్షాన్ని జెసిబి తో తొలగిస్తున్న జిహెచ్ఎంసి సిబ్బంది

చెరువు కట్ట తెగి కొట్టుకుపోయిన దేవాలయం…
హఫీజ్ పేట్ ప్రకాష్ నగర్ ఎదురుగా ఉన్న కొత్త కుంట అలుగులు, తూమును ఇటీవలో కొందరు కాంక్రీట్ తో మూసివేశారు. దీంతో చెరువులోకి పెద్దఎత్తున చేరిన వరద నీరు కిందికి ప్రవహించే అవకాశం లేకపోవడంతో కట్ట తెగింది. పైన ఉన్న కట్ట మైసమ్మ దేవాలయం సైతం వరదలో కొట్టుకుపోయింది. దీనిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

వరద ఉధృతికి కొట్టుకుపోతున్న ప్రకాష్ నగర్ కొత్త కుంట కట్ట మైసమ్మ దేవాలయం

అర్ధరాత్రి సహాయక చర్యల్లో ప్రభుత్వ విప్ గాంధీ…
శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గాంధీ అర్ధరాత్రి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జిహెచ్ఎంసి సిబ్బంది తో కలిసి మదినగూడ వద్ద వరద నీటి సమస్యను పరిశీలించారు. పెద్ద ఎత్తున జాతీయ రహదారిపైకి చేరడంతో డివైడర్ ను తొలగించి తాత్కాలిక పరిష్కారం చూపారు. దగ్గరుండి ట్రాఫిక్ ను నియంత్రించారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులకు గాంధీ సూచించారు.

మదినగూడ వద్ద అధికారులతో కలిసి అర్ధరాత్రి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ లోకి భారీ స్థాయిలో చేరిన వరద నీరు
లింగంపల్లి రైల్వే స్టేషన్ ముందు రోడ్డుపై అడ్డంగా నేలకూలిన వృక్షం
Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here