- డిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ముఖ్య నేతలు
- రాష్ట్ర వ్యాప్త టీపీయూఎస్ సభ్యులతో త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రకటన
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సంఘం చైర్మన్, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సామ వెంకటరెడ్డి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. టిపియుఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ నివాసం వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన సామా వెంకట్ రెడ్డి మీడియా ముందు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. 2001 నుంచి టీఆర్ఎస్ లో పని చేస్తున్నామని, అప్పటినుండే తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘంగా ఏర్పడి ప్రైవేటు ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం చేశామని అన్నారు. తెలంగాణ ఏర్పడితే తప్ప యువతకు న్యాయం జరగదని భావించి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమానికి వెన్నంటి నిలిచామని గుర్తుచేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలలో స్థానిక యువతకు 75శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అంగీకరించలేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారుల ఆకాంక్షలకు విలువలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా తామంతా టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగుల సంఘానికి 33 జిల్లాల్లో కమిటీలున్నాయని, దాదాపు 50వేల మందితో సంఘం బలంగా ఉందన్నారు. ప్రైవేటు కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాల పై మా ఆవేదన రేవంత్ రెడ్డికి విన్నవించగా సానుకూలంగా స్పందించారని, స్థానిక యువతకు 75శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. అందుకే కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు. తామంతా పదవులపై ఆశతో ఆశతో కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని, ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం సైతం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఉద్యోగుల సంఘ నాయకులతో చర్చించి తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని అన్నారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో సామ వెంకట్ రెడ్డి తో పాటు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేందర్, సెక్రటరీ జనరల్ పిట్ట శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పురుషోత్తం,టిపియుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలమడుగు రాజేందర్ తదితరులు ఉన్నారు.