నమస్తే శేరిలింగంపల్లి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల జరిగిన తిరుపతి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైద్యుల సూచన మేరకు క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో కోవిడ్ టెస్టు చేసుకోగా నెగటివ్ రావడంతో నగరంలోని తన వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి పొందుతున్నారు. తాజాగా ఆయనకు జ్వరం, ఒంటినొప్పులు మొదలవ్వడంతో మరోసారి పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నిపుణులు, కార్డియాలజిస్టు తంగెళ్ల సుమన్, అపోలో ఆసుపత్రికి చెందిన వైద్య బృందం ఆయనకు వైద్యసేవలు అందజేస్తున్నారు. ఊపిరితిత్తులలో నిమ్ము చేరడంతో అవసరమైన యాంటీ వైరల్ మందులతో పాటు ఆక్సిజన్ ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలోనే కోలుకుంటారని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. కాగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై చిరంజీవి దంపతులు, ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.