ఆదరించి అక్కున చేర్చుకుంది… అమ్మగా మారి పెళ్లి చేసింది

అనాథ యువతికి పెళ్లి చేసిన “సంకల్ప్ ఫౌండేషన్”

నవ వధూవరులు అశోక్, గీతలతో రోజీ

తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారింది గీత. నాయనమ్మ చెంతకు చేరి ఆమె బలవంతంతో భిక్షాటన చేస్తూ, చిత్తు కాగితాలు ఎరుకునేది. ఎంతోమంది అనాథల్లా తన జీవితం కూడా చుక్కాని లేని నావలా సాగింది. ఇదంతా పుష్కర కాలం క్రితం మాట. ఇప్పుడు ఆ గీత తలరాతను మార్చి కొత్త జీవితాన్ని అందించింది సంకల్ప్ ఫౌండేషన్. విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకురాలిని చేసింది,అంతటితో ఆగకుండా మంచి వ్యక్తిని చూసి తల్లిగా మారి పెళ్లి చేసి కొత్త జీవితాన్ని అందజేసింది సంకల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రోజి. మానవతా విలువలకు మారురూపంగా నిలుస్తూ రోజీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు మచ్చుతునక గీత వివాహ వేడుక. పూర్తి వివరాల్లోకి వెళితే…

చందానగర్ ప్రాంతానికి చెందిన గీత 2008 సంవత్సరంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. పాపిరెడ్డినగర్ లో నివసముండే ఆమె నాయనమ్మ చెంతకు చేరింది. ఆమె బలవంతంతో రోడ్లపై భిక్షాటన చేస్తూ, చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఓ హోటల్ ముందు ఉండగా సంకల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రోజీ కంట పడింది. ఆ క్షణమే గీత జీవితం కొత్త దారిలోకి మళ్లింది. చందానగర్ లోని సంకల్ప్ కేంద్రంలో ఆశ్రయం పొందిన గీత శారదా విద్యానికేతన్ లో పడవతరగతి వరకు, మదీనగూడా విజేత కళాశాలలో ఇంటర్మీడియట్ చదువును సంకల్ప్ చొరవతో పూర్తిచేసింది. గీత పెళ్లీడుకు రావడంతో ఆమె పెళ్లి బాధ్యతను భుజాలకెత్తుకుంది రోజీ. తండ్రిని కోల్పోయి వసతి గృహాల్లో ఉంటూ బికాం వరకు విద్యాభ్యాసం చేశాడు నల్గొండకు చెందిన అశోక్. ప్రస్తుతం ఇతను హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో సెక్యురిటి గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్ తో గీత వివాహం నిశ్చయించిన సంకల్ప్ ఫౌండేషన్ గురువారం వీరి వివాహాన్ని హుడా కాలనీలోని ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఇద్దరి జీవితాలను కలిపినందుకు సంతోషంగా ఉంది: రోజీ

నా అనే వాళ్ళు లేని ఇద్దరు జీవితాలను కలిపే బాధ్యత లభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది దేవుడు నాకు అందించిన గొప్ప అవకాశంగా భావిస్తున్న. ఫౌండేషన్ లో ఆశ్రయం పొందిన చిన్నారులందరి జీవితాల్లో వెలుగులు నింపడమే నా జీవిత ధ్యేయం.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here