- కరోనా నేపథ్యంలో వేడుకలకు దూరంగా మాదాపూర్ కార్పొరేటర్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన అతికొద్దిమంది రాజకీయ నాయకుల్లో జగదీశ్వర్‌గౌడ్ ఒకరు. ఉమ్మడి హఫీజ్‌పేట్ డివిజన్ వాసులకు గత దశాబ్దకాలంగా కార్పొరేటర్‌గా సేవలందిస్తూ ప్రజలు మెచ్చిన నాయకుడిగా నియోజవర్గ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. జగదీశ్వర్‌గౌడ్ జన్మదినం ఆయన అభిమానులకు పెద్ద పండగే. ప్రతీయేడు జగదీశ్వర్‌గౌడ్ నివాసం వద్ద నిర్వహించే వేడుకల్లో వందలాది మంది పార్టీ కార్యకర్తలు అభిమానులతో సందడి వాతావరణం నెలకొనేది. అయితే కరోనా నేపథ్యంలో గత సంవత్సరం మాదిరిగానే ఈ యేడు జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు జగదీశ్వర్‌గౌడ్. ముందుగానే పార్టీ నాయకులు, కార్యకర్తలకు వేడుకలకు తాను అందుబాటులో ఉండనని, వేడుకలకు బదులుగా సామాజిక సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
కాగా జన్మదినాన్ని పురస్కరించుకుని జగదీశ్వర్‌గౌడ్ అతికొద్ది మంది అనుచరులతో పలు ఆలయాలను సందర్శించారు. వర్గల్ సరస్వతి దేవి, కొమురవెల్లి మల్లికార్జున స్వామి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. నిరంతరం తన క్షేమం కాంక్షిస్తూ, ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులందరికీ రుణపడి ఉంటానని, తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. ఆలయాల సందర్శనలో జగదీశ్వర్‌గౌడ్‌తో పాటు బాలింగ్ యాదగిరి గౌడ్, రాజు తదితరులు ఉన్నారు.