శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): ఒకనాడు శేరిలింగంపల్లి లో కమిషనర్ గా సేవలందించి ఈ ప్రాంత వాసుల మన్ననలు పొందిన ఓ ప్రభుత్వ అధికారి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి అత్యున్నత అధికారి(ఇంచార్జ్ ఈవో)గా బాధ్యతలు చేపట్టాడు. ఆయనే ఏ.వి.ధర్మారెడ్డి. కర్నూలు జిల్లా నంది కొట్కూరు తాలూకా పురుమంచాల ప్రాంతానికి చెందిన ఈయనకు పేరుకు తగ్గట్టుగానే ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి ఎక్కువ అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డితో ధర్మారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన హయాంలో ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జాయింట్ ఈవో గా పనిచేశారు. వైఎస్ మృతి తర్వాత కేంద్ర రక్షణ విభాగంలో పని చేశారు. అదేవిధంగా శేరిలింగంపల్లి ప్రాంతం జిహెచ్ఎంసిలో విలీన కాకముందు ఈ ప్రాంతానికి మునిసిపల్ కమీషనర్ గా సేవలు అందించిన ధర్మారెడ్డి, జిహెచ్ఎంసి విలీనం అనంతరం వెస్ట్ జోన్ కమీషనర్ గా సేవలు అందించడం గమనార్హం. స్థానిక ప్రజలతో కలుపుగోలుగా ఉంటూ సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి విషయంలో నిబద్ధత తో పనిచేసే వాడని స్థానికులు ధర్మారెడ్డి తో గల అనుబంధాన్ని నమస్తే శేరిలింగంపల్లితో పంచుకున్నారు.