హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని సాయి ప్రశాంత్ నగర్‌లో కార్పొరేటర్ జానకి రామరాజు ఆదివారం బాబ్ కాట్‌తో రోడ్లపై పేరుకుపోయిన చెత్త చెదారం, మట్టి కుప్పలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్ పరిధిలో శుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రతి కాలనీలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగింప చేసి రోడ్లను క్లీన్ గా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

కాలనీవాసులు ఇక నుంచైనా చెత్తను రోడ్లపై పడవేయకుండా చెత్త డబ్బాలలో వేయాలని ఆయన సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యవంతులుగా ఉంటామని ఆయన తెలిపారు. ప్రజల సహకారంతో డివిజన్ ను స్వచ్ఛ డివిజన్ గా మారుస్తానని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ విజయ, ఏరియా కమిటీ మెంబర్ రేణుక, శేషయ్య, టీఆర్ఎస్ నాయకులు రవికుమార్, రంగనాథ రాజు, గోపాల్, శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





