నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపు నివారణకై నాలాల పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మహర్ పార్క్, నేతాజీ నగర్, గోపన్‌పల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన నాలాను పరిశీలించారు. అనంతరం డైమండ్ టవర్‌వద్ద రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉంటున్న సమస్యను పరిశీలించారు.
ఈ సందర్భంగా గంగాధరరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం వరదముంపుతో ఎంతోమంది ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారని, ఈ యేడు అటువంటి ఘటనలు పునరావృతం చెందకుండా పటిష్ట చర్యలు చేపడతామని తెలిపారు. సత్వరమే నాలా పూడిక పనులు నిర్వహించి వరదనీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపడతామని తెలిపారు. డైమండ్ టవర్స్ వద్ద వరద నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణవేణి, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, మంజీరా డైమండ్ టవర్స్ ప్రెసిడెంట్ శ్రీజిత్ నైర్ నాయకులు శ్రీ రాములు , రమేష్ తదితరులు పాల్గొన్నారు.