నమస్తే శేరిలింగంపల్లి: గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీకాట్) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కుంభ్‌సందేశ్ యాత్రకు సంపూర్ణ సహకారం అందిస్తానని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీ నటుడు నరేశ్ తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న కుంభ్‌సందేశ్ సన్నాహక యాత్ర ఏర్పాట్లలో భాగంగా జీకాట్ ప్రతినిధుల బృందం భిన్నవర్గాల మేధావులను కలిసి యాత్రకు సహకారం అందించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జీకాట్ బృందం నానక్‌రాంగూడలోని నరేశ్ నివాసంలో ఆయనను కలిసి యాత్రకు సంబంధించిన విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ ‘ కుంభ్‌సందేశ్ యాత్ర’ పేరుతో తలపెట్టిన ‘మిషన్ 5151’ ఉద్ధేశం ఎంతో గొప్పగా ఉందని, ఇది ఎంతో గొప్ప కార్యక్రమమని ఆయన ప్రశంసించారు. భారతదేశం సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక శక్తితో పాటు ఎనలేని విజ్ఞాన సంపదకు పుట్టినిల్లు అన్నారు.

భారతీయ వైజ్ఞానిక ప్రతిభ ఎంతటి శక్తిమంతమైనదో కరోనా సంక్షోభంతో ప్రపంచానికి తెలిసొచ్చిందన్నారు. దీంతో కరోనా అనంతర ప్రపంచానికి కుంభ్‌సందేశ్ ఒక దిక్సూచిగా మారనుందన్నారు. ఇంతటి గొప్ప ప్రయత్నాన్ని దిగ్విజయం చేసేందుకు తనవంతు సహకారంతో పాటు సినీ ఇండస్ట్రీ పెద్దలతో చర్చించి యాత్రలో అందరినీ భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తానని జీకాట్ ప్రతినిధులకు నరేశ్ హామీ ఇచ్చారు. ఆధునిక పోకడలతో సందేశ్‌కు వేదికైన కుంభమేళాలో సాంస్కృతిక, సామాజిక దృక్పథం లోపిస్తున్న తరుణంలో కుంభ్‌సందేశ్ యాత్ర దానిని పరిపూర్ణం చేస్తుందని నరేశ్ ఆకాంక్షించారు. 19న సన్నాహక యాత్ర ప్రారంభోత్సవానికి హాజరవుతానని నరేశ్ హామీ ఇచ్చారు. అనంతరం కుంభ్ సందేశ్ నిర్వాహకులు మాట్లాడుతూ భారతదేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితుల నుంచి వచ్చే సాధుసంతులు తమ తపోశక్తి ద్వారా పొందిన జ్ఞానాన్ని కుంభమేళలో చర్చకు పెట్టి మేధోమధనం చేసి దేశ కాలమాన పరిస్థితులకు తగ్గట్లుగా ఒక దిశా నిర్ధేశం చేయుటకై ఇచ్చే సందేశాన్ని కుంభ్ సందేశ్ గా పిలుస్తారని తెలిపారు. కుంభ్ సందేశ్ యాత్ర ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో మొదలై తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటిస్తూ తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకుంటుందని తెలిపారు. అక్కడి నుంచి కుంభ్ సందేశ్ అధికారిక యాత్ర మొదలై కుంభమేళా జరిగే నాలుగు ప్రాంతాలైన నాసిక్, ఉజ్జయిన్, ప్రయాగ, హరిద్వార్ వరకు యాత్ర కొనసాగుతుందన్నారు.ఈ కుంభ్ సందేశ్ యాత్ర కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే కార్యక్రమమని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. పౌర సమాజం, పార్టీల నాయకులు, ఎన్జీవోలు, కార్పొరేట్లు, విద్యావంతులు, మేధావులు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీకాట్ వ్యవస్థాపకులు, కుంభ్ సందేశ్ యాత్ర నిర్వాహక కార్యదర్శి డిల్లీ వసంత్ , కుంభ్‌సందేశ్ యాత్ర ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ `మిషన్ 5151` మంకెన శ్రీనివాస్‌రెడ్డి, అరిగె రామస్వామి మెమోరియల్ సర్వీసెస్ వ్యవస్థాపక చైర్మన్ అరిగె మధుసూధన్, జీకాట్ సీఈవో శ్రవణ్ మడప్ , బీజేపీ రాష్ట్ర నాయకులు, రెడ్డి జేఏసీ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, `కారా`(సీఏఆర్ఏ) ఫార్మా మాజీ చైర్మన్ మందా రాంచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.