నమస్తే శేరిలింగంపల్లి: ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపొందడం ఖాయమని మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సురేష్ నాయక్ అన్నారు. శుక్రవారం డివిజన్ లో పార్టీ అభ్యర్థి డాక్టర్ చిన్నారెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగ పట్టభద్రులందరూ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని అన్నారు. ప్రతి పట్టభద్రుని వద్దకు వెళ్లి వారికి చిన్నారెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. టిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఓటర్లను ఎంత ప్రలోభ పెట్టినా ఓటు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఖాతాలోనే జమ అవుతుందని అన్నారు. గత ఏడు సంవత్సరాలుగా మాయ మాటలు చెప్పి ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






