మాదాపూర్ డివిజన్ ప్రజల మనసు గెలిచేదెవరో ..?

  • దశాబ్ద కాలంగా ప్రజా ప్రతినిధిగా కొనసాగుతున్న టిఆర్ఎస్ అభ్యర్థి
  • బిజెపి అనుకూల పవనాలపై ధీమాతో ఆ పార్టీ అభ్యర్థి
  • మాస్ ఓటర్ల చేతుల్లోనే అభ్యర్థుల జయాపజయాలు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరో ముఖ్యమైన డివిజన్ మాదాపూర్ 107 . పేరుకే గొప్ప ప్రాంతమైనప్పటికీ ఈ ప్రాంతం వివాదాస్పద భూములకు కేంద్ర బిందువు. ఈ డివిజన్ లో కోర్టు వివాదాల్లో ఉన్న ఎన్నో భూముల్లో వెలసిన గోకుల్ ప్లాట్స్, అయ్యప్ప సొసైటీ వంటి కాలనీలు, హఫీజ్ పేట్ వంటి బస్తీల్లో నివసించే ప్రజలు నిర్మాణాల విషయంలో ఎదుర్కొనే సమస్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. వివాదాలు న్యాయస్థానాల పరిధిలో ఉండటంతో ప్రజాప్రతినిధులు సైతం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. డివిజన్ లో మెజారిటీ వాటా బస్తీలదే కావడంతో మాస్ ఓటర్లే ఎన్నికల ఫలితాలను శాసించే స్థితిలో ఉన్నారు. మైనారిటీ ఓటర్లు సైతం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. తాజా లెక్కల ప్రకారం ఈ డివిజన్ లో ఓటర్ల సంఖ్య 58126 .

డివిజన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు…
మాదాపూర్ డివిజన్ పరిధిలో అపర్ణ కౌంటీ, ఇజ్జత్ నగర్, సాయినగర్, మాదాపూర్, కొండాపూర్, గోకుల్ ప్లాట్స్, మాతృశ్రీ నగర్, మాధవనగర్, రాజారామ్ కాలనీ, అయ్యప్ప సొసైటీ, జైహింద్ ఎంక్లేవ్, అరుణోదయ కాలనీ, మెగా హిల్స్, రవీంద్ర సొసైటీ, సిలికాన్ వ్యాలీ, బిక్షపతి నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, ఆదిత్య నగర్, కృష్ణ కాలనీ, లక్ష్మి నగర్, సైబర్ వ్యాలీ, సైబర్ విలేజ్, హనుమాన్ నగర్, రవి ఎంక్లేవ్, ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్, ఖానమెట్, జయభేరి ఎనక్లేవ్ తదితర ప్రాంతాలు ఉన్నాయి.

గత ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి..
2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో మాదాపూర్ డివిజన్ లో 21588 మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ 11782 ఓట్లతో విజయం సాధించగా టిడిపి నుండి పోటీ చేసిన ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ 5777 ఓట్లతో రెండవ స్థానం లో నిలిచాడు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన గంగల నర్సింహా యాదవ్ 3686 ఓట్లతో మూడవ స్థానం లో నిలిచాడు.

డివిజన్ నుండి బరిలో ఉన్నప్రధాన పోటీదారుల వివరాలు ఇలా ఉన్నాయి.

వి.జగదీశ్వర్ గౌడ్ (టిఆర్ఎస్)


కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి గా పని చేసిన మల్లికార్జున గౌడ్ సోదరుడు హరిశంకర్ పటేల్ కుమారుడే జగదీశ్వర్ గౌడ్. బాబాయి స్పూర్తితో రాజకీయ అరంగేట్రం చేసిన జగదీశ్వర్ గౌడ్ 2009 ఎన్నికల్లో ఉమ్మడి హఫీజ్ పేట్ డివిజన్( ప్రస్తుత హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్లు) నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే 2647 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించాడు. కార్పొరేటర్ గా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో పాలన అందించడంతో డివిజన్ పై గట్టి పట్టు సాధించాడు. అనంతరం 2016 ఎన్నికల సమయంలో డివిజన్ల పునర్విభజనలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్లుగా విడిపోయింది. ఇదే సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన జగదీశ్వర్ గౌడ్ మాదాపూర్ నుండి, అయన సతీమణి పూజిత జగదీశ్వర్ గౌడ్ హఫీజ్ పేట్ నుండి పోటీ చేయించి రెండు డివిజన్లలో విజయం సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. గ్రేటర్ లోని 150 డివిజన్లలో టిఆర్ఎస్ అధిష్టానం జగదీశ్వర్ గౌడ్ కు మాత్రమే రెండు స్థానాలు కేటాయించడమే ఆయనకు స్థానికంగా ఉన్న బలాన్ని రుజువు చేసింది. ప్రస్తుతం మరోసారి టిఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలుచున్నాడు. గత పదేళ్ల రాజాకీయ జీవితంలో అవినీతికి తావివ్వకుండా మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందాడు జగదీశ్వర్ గౌడ్.

గంగల రాధాకృష్ణ యాదవ్(బిజెపి)


ఖానామేట్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు గంగల నర్సింహా యాదవ్ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ప్రధాన అనుచరుడు. నర్సింహా యాదవ్ తనయుడైన రాధాకృష్ణ స్థానికంగా వ్యాపార, సామాజికంగా గుర్తింపు కలిగిన వ్యక్తి. ఈ ప్రాంతంలోని సొంత సామజిక వర్గంలో సైతం మంచి పట్టు కలిగి ఉన్నాడు. బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటినుండి వారి వెంటే కొనసాగుతూ వచ్చారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గంగల నర్సింహా యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి 3686 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. ఇటీవల రవికుమార్ యాదవ్ తో పాటుగా బిజెపి లో చేరిన నరసింహ యాదవ్, రాధాకృష్ణ యాదవ్ లు వారి సహకారంతోనే మాదాపూర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బిక్షపతి యాదవ్ అనుచరగణం, సొంత సామాజికవర్గ సహకారం, బిజెపి అనుకూలతలు బలాలుగా ఎన్నికల ప్రచారంలో కొనసాగుతున్నారు.

వీరితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి గా నగేష్, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు తన్నీరు ప్రసాద్ టీడీపీ అభ్యర్థి గా, స్వతంత్ర అభ్యర్థులు గా ఆరెపల్లి సాంబశివ రావు, షేక్ వహీద్ లు పోటీలో ఉన్నారు.

మాదాపూర్ డివిజన్ లో మరోసారి…
ఈ డివిజన్ నుండి ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన జగదీశ్వర్ గౌడ్, రాధాకృష్ణ యాదవ్ లు గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో సైతం ప్రత్యర్థులు కావడం విశేషం (గత ఎన్నికల్లో రాధాకృష్ణ యాదవ్ తండ్రి పోటీ చేశారు). అయితే అదే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి 5777 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచిన ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం టీఆరెస్ పార్టీలో ఉంటూ జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా పనిచేయడం టీఆరెస్ పార్టీకి మరింత బలాన్నిచేకూర్చనుంది. గత పదేళ్లుగా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా డివిజన్ లో సేవలందించిన జగదీశ్వర్ గౌడ్ ప్రజల మెప్పు పొందాడు. ఈ కారణంగా పార్టీ బలంతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ సైతం ఆయనను విజయం దిశగా నడిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సైతం బీజేపీ అనుకూల ఓటర్లు అధికంగానే ఉన్నప్పటికీ తక్కువగా నమోదవుతున్న పోలింగ్ శాతం బీజేపీ గెలుపోటములపై ప్రభావం చూపనుంది. రాధాకృష్ణ డివిజన్ వాసి కావడంతో స్థానికంగా ఓటర్లను కొద్దిమేర తనవైపు తిప్పుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు ఎన్నికల్లో బీజేపీ కి వీస్తున్న అనుకూల పవనాలు కమల వికాసానికి దోహదం చేయనున్నాయి. ఏదేమైనా ఇప్పటివరకు జరిగిన పరిణామాల రీత్యా డివిజన్ ఎన్నికల్లో కారు ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here