- ఒక్కో సర్కిల్‌కు ఏసీపీ ర్యాంక్ స్థాయి అధికారి నియామకం
- ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి ఏర్పాట్లు, భద్రత
- 15 చోట్ల చెక్ పోస్టుల ఏర్పాటు, మద్యం, డబ్బు సరఫరాపై నిఘా
- సోషల్ మీడియాపై నిరంతర నిఘా
- అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు: సీపీ వీసీ సజ్జనార్
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 13,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన పలువురు పోలీసు అధికారులతో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథిని కలిశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 13,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటారని, సైబరాబాద్ కమిషనరేట్ కిందకు 38 డివిజన్లు, 19 పోలీస్ స్టేషన్లు వస్తాయని సజ్జనార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 20.50 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. మొత్తం 674 ప్రాంతాల్లో 2,569 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఓటు హక్కును డిసెంబర్ 1న వినియోగించుకుంటారని తెలిపారు.
అన్ని రాజకీయ పార్టీలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించామని, పోలింగ్ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి జీహెచ్ఎంసీ సర్కిల్‌కు ఏసీపీ ర్యాంక్ స్థాయి అధికారిని నియమించామని, పోలింగ్ స్టేషన్లు ఉన్న ఒక్కో ప్రాంతానికి ఇద్దరు అధికారులు ఉంటారని, వారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తారని తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 15 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, మద్యం, డబ్బు పంపిణీ జరగకుండా పోలీసులు చూసుకుంటారని తెలిపారు. అలాగే మరో 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను మోహరించినట్లు తెలిపారు. 11 స్టాటిక్ సర్వేలెన్స్ టీంల ద్వారా నిఘా ఉంచామన్నారు. రోజులో 24 గంటలూ 3 షిఫ్టుల్లో పోలీసులు విధులు నిర్వర్తిస్తారన్నారు. ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పెట్రోలింగ్ వాహనాలకు అమర్చిన సీసీ కెమెరాలను వాడుతామన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 588 లైసెన్స్‌డ్ ఆయుధాలను డిపాజిట్ చేశారని, 368 మందిని బైండోవర్ చేశామని తెలిపారు. ఐటీ యాప్స్, జియో టాగింగ్‌ను ఉపయోగించి సైబరాబాద్ పోలీసులు నిఘా పెట్టారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు సజావుగా సాగేట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పౌరులు 9490617444 అనే నంబర్‌కు వాట్సాప్ ద్వారా తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చన్నారు. సోషల్ మీడియాపై కూడా నిఘా కొనసాగుతుందన్నారు. అల్లర్లు, గొడవలు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఏసీపీ రవికుమార్, ఏఎస్‌పీలు అఖిల్ మహాజన్, ఖారే కిరణ్ ప్రభాకర్, నికితా పంత్, అక్షాంశ్ యాదవ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.