చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ గద్దెనెక్కి అధికారంలోకి వచ్చిన అనంతరం ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులను నట్టేట ముంచి టిఆర్ఎస్ సర్కారుకు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెప్పాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి నాయకులు ఎం.రవికుమార్‌యాదవ్ అన్నారు. మంగళవారం చందానగర్‌లోని యం.యన్.ఆర్ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసిన ఆయన బిజెపి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్‌రావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గడిచిన ఏడు సంవత్సరాలలో నేటి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, నిరుద్యోగులకు, విశ్రాంతి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని, వారికి కేటాయించిన పిఆర్‌సి, ఐఆర్, డిఎ పెంపు విషయాలలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని తెలిపారు. 2018 ఎన్నికలలో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని అన్నారు. నిరుద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారించేందుకు బిజెపి పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ రామచంద్ర రావు గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రఘునాథ్ యాదవ్, రాధా కృష్ణ యాదవ్, నాగరాజ్ , ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

చందానగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎం.రవికుమార్‌యాదవ్