శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్ద కుడి చెరువు, పటేల్ చెరువు వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేసి పురోగతిని సమీక్షించారు. అనంతరం జాతీయ రహదారి వెంబడి, మియాపూర్ సర్కిల్లోని వివిధ కాలనీలలో వర్షపు నీరు నిలిచిపోతున్న ప్రాంతాలను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ డ్రైనేజీ మెరుగుదల పనులను వేగవంతం చేయాలని, నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువుల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నీటి నిల్వ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ తనిఖీలలో జోనల్ కమిషనర్ వెంట ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.






