సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ శంకుస్థాపన ఏర్పాట్ల‌ను పరిశీలించిన గాంధీ, కమిషనర్ సృజన

శేరిలింగంప‌ల్లి, జూన్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని PAC చైర్మన్ ఆరెక‌పూడి గాంధీ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన స్థలం, సభా ప్రాంగణం ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్‌లో మొండికుంట చెరువు సమీపంలో నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ స్థలాన్ని ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా CMC కమిషనర్ సృజన, డీసీపీ రితీరాజ్, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డీసీ బాలకృష్ణతోపాటు ప్రాజెక్ట్స్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సుపరిపాలన అందించేందుకు అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన CMC ప్రధాన కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రజలకు సులభంగా సేవలు అందేలా, వారి సమస్యల పరిష్కారానికి దోహదపడేలా భవనాన్ని రూపొందించనున్నామని చెప్పారు. నిర్మాణానికి సంబంధించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమం, సభా ప్రాంగణం ఏర్పాట్ల‌ను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం శుభపరిణామమని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆరెకపూడి గాంధీ తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, సమగ్ర మౌలిక వసతులతో ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన శేరిలింగంపల్లిని నిర్మించడమే తన ధ్యేయమని ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ అధికారులు శ్రీకాంతిని, రూపాదేవి, దుర్గాప్రసాద్, వరుణ్, శ్రీనాథ్, సురేందర్, కృష్ణమోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here