శేరిలింగంపల్లి, ఆగస్టు 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఆగస్టు 29, 30 తేదీలలో రెండు రోజుల పాటు మియాపూర్ ముజాఫర్ అహ్మద్ నగర్(ఎం.ఏ నగర్) లో యంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సమావేశాలను నిర్వహించనున్నామని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరై ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలతోపాటు రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల అమలుపై చర్చించి భవిష్యత్తు కార్యక్రమ రూపకల్పన చేయడం జరుగుతుందని తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ కొనసాగింపుగా తగిన కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుందని తెలియజేశారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు.






