ప్రపంచ పర్యావరణ దినోత్సవం: మసీదుబండ చెరువు వద్ద మొక్కలు నాటిన ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జూన్ 5 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండ కుడి కుంట చెరువు వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరెకపూడి గాంధీ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్రకృతి వనరుల క్షీణత మానవ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుదాం – భవిష్యత్తును రక్షిద్దాం, ఒక్క మొక్క ఎన్నో ప్రాణాలకు ఆధారం, ప్రకృతి మన సంపద – పరిరక్షణ మన బాధ్యత అనే సందేశాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఇళ్ల పరిసరాలు, కాలనీలు, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం, వాతావరణ మార్పులపై చైతన్యం కల్పించడం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, అలాగే నీరు, గాలి, నేల కాలుష్యాన్ని నివారించడమేనని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. UBD అధికారి విక్రమ్, నాయకులు మారబోయిన రాజు యాదవ్, గణేష్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here