మియాపూర్ ఫ్లైఓవర్ సహా రూ.2వేల కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

శేరిలింగంపల్లి, జూన్ 5 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్‌ (సీఎంసీ) ప్రధాన కార్యాలయం సహా పలు కీలక అభివృద్ధి పనులకు ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన సభా ప్రాంగణం, శంకుస్థాపన స్థలం ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎంసీ కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, ప్రాజెక్టు విభాగం, ఇంజినీరింగ్ అధికారులు తదితరులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ చరిత్రలో ఒకే రోజు సుమారు రూ.2వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగడం విశేషమన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రూ.530 కోట్ల అంచనా వ్యయంతో 1,790 మీటర్ల పొడవు, 6 లేన్ల ద్విముఖ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. దీనితో పాటు హఫీజ్‌పేట్ నుంచి మియాపూర్ వరకు 3 లేన్ల ఏకముఖ అండర్‌పాస్, బాచుపల్లి నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు మరో 3 లేన్ల ఏకముఖ అండర్‌పాస్‌ను కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మియాపూర్, చందానగర్, హఫీజ్‌పేట్, బాచుపల్లి ప్రాంతాల మధ్య ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని, ప్రయాణ సమయం, ఇంధన వ్యయం ఆదా అవుతాయని గాంధీ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ రంగం విస్తరణ, జనాభా పెరుగుదల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. హెచ్‌ఐసీటీఐ ప్రాజెక్టు ద్వారా రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో సుమారు రూ.2వేల‌ కోట్ల అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని గాంధీ వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో శేరిలింగంపల్లిని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, సమగ్ర అభివృద్ధితోపాటు మెరుగైన మౌలిక వసతులు, ట్రాఫిక్ రహిత వాతావరణం, ఉన్నత జీవన ప్రమాణాల కల్పనకు కృషి చేస్తున్నామని ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ ఎస్‌ఈ శ్రీకాంతిని, ఈఈ గోవర్ధన్, డీఈ రూపాదేవి, డీఈ దుర్గాప్రసాద్, హెచ్‌ఐసీటీఐ ప్రాజెక్టు డీఈ వరుణ్, ఏఈ శ్రీనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here