నూతన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మన దేశంలో రైతాంగాన్ని మరింత నష్టాల పాలు జేసే వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాల‌ని క‌మ్యూనిస్టు నాయ‌కులు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు వారు శుక్ర‌వారం చందానగర్ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

చందాన‌గర్ గాంధీ విగ్ర‌హం వద్ద నిర‌స‌న వ్యక్తం చేస్తున్న క‌మ్యూనిస్టు నాయ‌కులు

ఈ సందర్బంగా సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి సి.శోభన్, ఎంసీపీఐ నాయకుడు అనిల్ కుమార్ లు మాట్లాడుతూ.. గుజరాత్ కార్పొరేట్ శక్తుల కోసమే నూతన వ్యవసాయ బిల్లును తెచ్చార‌ని విమర్శించారు. తెలంగాణలో దాదాపుగా 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నార‌ని, ఈ బిల్లు వల్ల వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. రైతులకు సరైన మద్దతు ధర లేద‌ని, సరైన ప్రోత్సాహం కూడా ల‌భించ‌డం లేద‌ని అన్నారు. మార్కెట్ వ్యవస్థ కూడా స‌రిగ్గా లేద‌న్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ బిల్లు వల్ల కార్పొరేట్ శక్తులకు లాభం తప్ప‌ పేద రైతులకు ఎలాంటి లాభం లేదన్నారు.

దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు, రైతులు, రాజ‌కీయ పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయ‌‌ని, ఎన్‌డీఏలో ఒక మంత్రి కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా మంత్రి పద‌వికి రాజీనామా చేశార‌ని అన్నారు. అయినా దొడ్డి దారిన పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించుకుంద‌ని విమ‌ర్శించారు. దేశ వ్యాప్తంగా రైతులు, చిన్న చిన్న వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నార‌న్నారు. దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కృష్ణ, వరుణ్, శ్రీనివాస్, సురేష్, ఎంసీపీఐ నాయకులు రవి, మధు, రాజు, పుష్పలత, శివాని, అనిత, అమీనా బేగం, హెచ్‌సీయూ విద్యార్థి నాయకులు అభిషేక్, బషీర్, కులదీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here