కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను సమాకూర్చే దిశగా మంజూరు అయిన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్టు కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు. శుక్రవారం మార్తాండ్ నగర్ పోచమ్మ గుడి వెనుక వీధుల్లో కొనసాగుతున్న అంతర్గత రోడ్ల పనులను కార్పొరేటర్ హమీద్ పటేల్ పరిశీలించారు. కొన్ని వీధులలో కొండ రాయి తొలగించడం కష్టతరంగా ఉండటం వల్ల కొండ రాయి స్థాయిని బట్టి రోడ్ల సమాంతర స్థాయిని పాటిస్తూ రోడ్ల నిర్మాణాలు సాగించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. అంతర్గత రోడ్లు పనులు చేసేప్పుడు ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేయించాలని కాంట్రాక్టర్ కి సూచించారు.
మార్తాండ్ నగర్ పోచమ్మ గుడి వెనుక కొన్ని వీధులలో కొండ రాయి ఉండటం వల్ల, ఎత్తు వల్ల మంజీరా నీటి సరఫరా సవ్యంగా రావటం లేదని ప్రజలు కార్పొరేటర్ హమీద్ పటేల్ దృష్టికి తీసుకు వచ్చారు. సమస్యను పరిష్కరించే దిశగా కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంటనే స్పందించి సంబంధిత వాటర్ బోర్డు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు వాటర్ వాల్వ్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీనివాస్ చౌదరి, ఏరియా కమిటీ మెంబర్ తాడెం మహేందర్, శైలజ, భవాని, రామలక్ష్మి, విజయలక్ష్మి, తబసు, శంకరమ్మ, వేణు,పెద్దిరాజు, ఏసుబాబు, నాగేశ్వరావు, నాగలక్ష్మి, పద్మ, మంజు, కుమార్, యూత్ నాయకులు దీపక్, వంశీ, దుర్గా ప్రసాద్, రామకృష్ణ, యోగి, హరిబాబు పాల్గొన్నారు.