ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా విజ‌యోత్స‌వాలు ఎందుకు: పొట్ట నరేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వేయి రోజుల పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయం, నెరవేరని హామీలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. శేరిలింగంపల్లి గ్రామం కేంద్రంగా నిర్వహించిన ర్యాలీ, రచ్చబండ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వేయి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

శేరిలింగంపల్లి గ్రామం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ తారానగర్, హుడా ట్రేడ్ సెంటర్ తదితర ప్రాంతాల మీదుగా కొనసాగింది. బీఆర్ఎస్ జెండాలు, నినాదాలతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. ప్రజలు, యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పొట్ట నరేందర్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. ప్రజల సమస్యలకు సమాధానం చెప్పకుండా వేయి రోజుల విజయోత్సవాల పేరుతో ప్రచారం చేసుకోవడం కాదని, ప్రజల మధ్యకు వచ్చి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల భారీ స్పందనతో ర్యాలీ, రచ్చబండ కార్యక్రమం విజయవంతమైందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here