శేరిలింగంపల్లి, జూన్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మకుంట చెరువులో జరుగుతున్న సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ స్థానిక కాలనీవాసులు, వాకర్స్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లిగవాడ్ ఫౌండేషన్ సహకారంతో కైదమ్మకుంట చెరువును సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. చెరువును సుందరవనంగా తీర్చిదిద్దడంతోపాటు వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్, చెరువు కట్ట బలోపేతం, అలుగు మరమ్మతులు, మురుగు నీరు చెరువులోకి చేరకుండా యూజీడీ మళ్లింపు పైప్‌లైన్ నిర్మాణం వంటి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వరదనీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా ఇన్‌లెట్, ఔట్‌లెట్‌లను సక్రమంగా అభివృద్ధి చేయాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.

ప్రజలు, వాకర్స్‌కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, చెరువు చుట్టూ సుందరీకరణతోపాటు తామర పూలను పెంచి ప్రకృతి అందాలను మరింత పెంపొందిస్తామని చెప్పారు. గతంలో చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి శుభ్రపరిచిన అనంతరం దోమల సమస్య తగ్గిందని, ఇప్పుడు శాశ్వత అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను ఇదే తరహాలో అభివృద్ధి చేసి, కబ్జాలు, కాలుష్యం లేకుండా పూర్తి స్థాయిలో సంరక్షిస్తామని ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.





