కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేస్తాం: మాజీ మంత్రి కేటీఆర్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి నిలబెట్టేందుకు ముందుకు వస్తామ‌ని, బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెబుతామ‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ప‌రిధిలోని మియాపూర్ న‌రేన్ గార్డెన్స్‌లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌తోనే ఉంటామ‌ని వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌ని అన్నారు. 10ఏళ్లలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం చేశామ‌ని, ఇన్నాళ్లు బీఆర్ ఎస్ ను రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించార‌ని అన్నారు. కేసీఆర్ ను సీఎం చేసేందుకు ఎంతో పనిచేశారని, హైదరాబాద్ ప్రజలు ఎంతో గొప్పవారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కరెంట్ సమస్య పరిష్కరించామ‌ని, హైదరాబాద్ అంటే మినీ భారతదేశం అని అభివ‌ర్ణించారు.

అన్ని రాష్ట్రాల నుండి వచ్చి ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారని, 10 ఏళ్లు శాంతిభద్రతల సమస్య లేకుండా నడిపామ‌ని కేటీఆర్ అన్నారు. మొదటి సారే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 100 కార్పొరేషన్ సీట్లు ఇచ్చిన ప్రజలకు కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు. 2015 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్నింటికన్ని గెలిచామ‌ని, అప్పుడు ఎమ్మెల్యేలు లేరని అన్నారు. గాంధీని 2018లో ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామ‌ని, కేబినెట్ హోదాతో విప్ పదవి ఇచ్చామ‌ని గుర్తు చేశారు. గుండెల్లో పెట్టుకుని చూసుకున్నామ‌ని అన్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జితో పాటు, అత్యధిక అండర్ పాస్ లు ఉన్నవి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే అని, అన్ని సినిమాల్లో కనిపించే అభివృద్ధి, అందమైన దృశ్యాలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనివే అని అన్నారు. పదేళ్లలో రూ.9500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, లింక్ రోడ్లు, సీవరేజ్ వాటర్ ట్యాంక్ లు, మంచినీళ్లు ఇలా ప్రజల ప్రతీ అవసరం తీర్చామని అన్నారు.

పేదలు ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే పట్టాలు ఇచ్చామ‌ని, వారందరిని కడుపులో పెట్టుకుని చూసుకున్నామ‌ని, పేద వారికి జీవో 58 ద్వారా పట్టాలు ఇచ్చామ‌ని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా కేసీఆర్ కిట్లు, ఆడ పిల్లలు పుడితే డబ్బులు ఇచ్చామ‌ని, శేరిలింగంపల్లిలోనే కాదు నగరంలో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేశామ‌ని, అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేశామ‌ని అన్నారు. హైదరాబాద్ నగరం తెలంగాణకు గుండెకాయ అని, హైదరాబాద్ ప్రజలు ఎంతో తెలివిగా ఆలోచించి 2023లో కూడా కాంగ్రెస్ కు ఒక్కసీటు ఇవ్వకుండా బీఆర్ ఎస్ ను గెలిపించారని, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. రెండో ఆలోచన లేకుండా గెలిపించారని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా తాము చేసిన అభివృద్ధిని చూసి గెలిపించారని, మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపిస్తే ఓట్లు వేశారని అన్నారు.

కేసీఆర్ కంటే ఎక్కువగా ఇస్తామంటూ రంగుల కలలు చూపెట్టారని విమ‌ర్శించారు. ఒకరికి కాదు ఇద్దరికి పెన్షన్ ఇస్తా అని మాయమాటలు చెప్పారని, 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారని, గెలిచేందుకు 420 హామీలు ఇచ్చారని ఆరోపించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టవద్దని 6 నెలలు ఏమీ మాట్లాడకూడదని చెప్పారని, పరిపాలన చేసే సమర్ధత లేక కామెంట్లు చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రం అప్పుల పాలైందని కింది నుండి మీది ప్రతీ నాయకుడు అదే చెబుతున్నారని, కరోనా సమయంలో కూడా సున్నా ఆదాయం ఉన్నా అభివృద్ధి చేశామ‌ని, కరోనాలో కూడా లింక్ రోడ్లు, అండర్ పాస్ లు, రైతుబంధు, ఇలా ఏదీ ఆగలేదని స్ప‌ష్టం చేశారు. దేశమంతా రోడ్లు బంద్ అయినా తాము అభివృద్ధి ఆపలేద‌ని, రూపాయి లేకున్నా ఎన్నో పనులు చేశామ‌ని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ కూడా ఎడమ కాలు చెప్పు తీసి కొట్టినట్లు చెప్పిందని ఎద్దేవా చేశారు.

బీఆర్ ఎస్ చేసిన అప్పులపై స్వయంగా పార్లమెంట్ చెప్పినా అబద్ధాలు ఆపడం లేదని, చివరికి స్పీకర్ కూడా అబద్ధాలు చెబుతున్నారని, రూ.6లక్షల వేల కోట్ల అప్పు చేశారని చెబుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, అందుకు కారణం హైడ్రా అని, దాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ పడితే అక్కడ పేదల గుడిసెలు కూల్చారని, పెద్దవారిని ఎవరూ ఏమీ అనడం లేదని అన్నారు. తాము ఎవరితో కలవమ‌ని, తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు బీఆర్ ఎస్ పార్టీ ఉంటుందని, అందరినీ కలుపుకునే పోతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉత్తర భారతదేశం అయినా దక్షిణ భారత దేశం అయినా అందరూ సమానమే అని, అందరిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామ‌ని అన్నారు. డివిజన్, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు ఈ స‌మావేశంలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here