శేరిలింగంపల్లి, జనవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజా బాటలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ లోని బాపూనగర్, గోపినగర్, ప్రశాంతినగర్ లలో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ మన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నందున, విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వినతి పత్రాన్ని కార్పొరేటర్ స్థానిక ప్రజలకు అందజేశారు.

ప్రజా బాట కార్యక్రమ ప్రధాన ఉద్దేశాలను ఆయన వివరించారు. లో-ఓల్టేజ్, లూజ్ వైర్లు, అదనపు విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించడం, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడం, విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, క్షేత్రస్థాయిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే నాణ్యమైన పరిష్కారం చూపడం వంటి చర్యలు చేపడతారని తెలిపారు. ఆయా సెక్షన్ల పరిధిలో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో వినియోగదారుల నుంచి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారని అన్నారు. విద్యుత్ అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు తెలుసుకుంటారని. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరిస్తారని మిగతా వాటిని నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తారని తెలిపారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ ను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మౌలిక సదుపాయాలలో భాగంగా రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడంపై దృష్టి సారించి 90 శాతం పనులు పూర్తి చేశామని మిగిలిన అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో చర్చించి ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. బస్తీలు, కాలనీలలో సౌకర్యవంతమైన జీవనాన్ని కల్పించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు గచ్చిబౌలి డివిజనల్ ఇంజనీర్ యాదగిరి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శివప్రసాద్, నల్లగండ్ల సెక్షన్ ఏఈ వెంకట్ నారాయణ రెడ్డి, గచ్చిబౌలి సెక్షన్ ఏఈ భాస్కర్, లైన్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ సుందర్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, సీనియర్ నాయకుడు యాదా గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, బాపు నగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గఫూర్, సుధాకర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, గోపినగర్ అంబేద్కర్ భవన్ ప్రెసిడెంట్ రమేష్, రవీందర్, ముసలయ్య, సత్యనారాయణ, మహేందర్ సింగ్, సుశీల, ముంతాజ్ బేగం, భారతమ్మ, ఖలీం, దస్తగిరి, అలీం, రాజు, పూర్ణ చందర్, సత్యం, కృష్ణ, మహేష్ చారి, ప్రవీణ్, సందీప్, వీరేందర్, ఏజాజ్, రవి, సాయికృష్ణ, ఆనంద్, వేణు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.





