మియాపూర్, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని కెనరి పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు వినాయక శ్లోకాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం మట్టి వినాయకులను పూజించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని విద్యార్థులు ప్రదర్శించిన నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను కట్టిపడేశాయి. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా వినాయక చవితి ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. భారతీయుల ముఖ్య పండుగలలో ఇదొకటన్నారు.
పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారని, ప్రతి ఒక్కరూ మట్టితో వినాయక విగ్రహాన్ని తయారుచేసి పండుగను జరుపుకోవాలని సూచించారు. అందరూ మట్టి వినాయకుల విగ్రహాలనే పూజించేలా విద్యార్థులు తమ ఇంటి పరిసరాల్లోని వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా క్రిస్టినా విద్యార్థులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ సీనియర్ నవీన్, కోఆర్డినేటర్లు అపర్ణ,ముక్తా, అడ్మిన్ మేనేజర్ మహేష్, పాఠశాలేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
జీఎస్ఎం మాల్‌లో..
వినాయక చవితి సందర్భంగా జీఎస్ఎం మాల్ లో కెనరి విద్యార్ధులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శనకు హాజరైన సందర్శకులకు పర్యావరణంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మట్టి వినాయకులను తయారు చేయడం, వాటి వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నాటకం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.