చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణం సందర్భంగా శ్రీ పద్మావతి శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి సుప్రభాత సేవ, విశేష అర్చన, బాలబోగం నివేదన, శ్రీ పద్మావతిమాత శ్రీ గోదాదేవిమాత సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం, శాంతి హోమం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం హారతి, తీర్ధ ప్రసాదాల వితరణ చేపట్టారు. ఈ విశేష కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు సత్యసాయి ఆచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి పూజలు చేయడంతోపాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.