సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): బహిరంగ ప్రదేశాల్లో సెల్ఫోన్లను వాడేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఫోన్లను పోగొట్టుకోవద్దని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో క్రైమ్ వింగ్ పోలీసులు రికవరీ చేసిన 200 సెల్ ఫోన్లను యజమానులకు అప్పగించారు.
ఈ సందర్బంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. సైబరాబాద్ క్రైమ్స్ వింగ్ పోలీసులు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సెల్ఫోన్లను ట్రేస్ చేసి కనిపెట్టారని, వాటిని ఓనర్లకు అప్పగించడం జరిగిందని తెలిపారు. ఫోన్లను వాడేవారు వాటిని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, ఫోన్లను కోల్పోతే మన విలువైన సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్ కుమార్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ఎస్ఐ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.