శేరిలింగంపల్లి, జూలై 14 (నమస్తే శేరిలింగంపల్లి): స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 15 రోజుల స్వచ్ఛత పక్వాడ ప్రత్యేక పారిశుధ్య, పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ బాలికల, బాలుర పాఠశాలలో తెలంగాణ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి, ప్రముఖ సినీ నటుడు సురేష్ గోపి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అతిథులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. తల్లి గౌరవార్థం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా ప్రకృతికి సేవ చేసినట్లవుతుందని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అతిథులు పేర్కొన్నారు. స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో బీపీసీఎల్ రాష్ట్ర హెడ్ (ఎల్పీజీ) నిరంజన్ కుమార్, ఏపీ-తెలంగాణ జనరల్ మేనేజర్ (రిటైల్) జగన్నాధ రావు, హైదరాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (రిటైల్) షెఫాలీ సింగ్, ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్ పీయూష్ మిట్టల్, హెచ్పీసీఎల్ జోనల్ హెడ్ సుశీల్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ కల్పన, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.





