నమస్తే శేరిలింగంపల్లి: రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని, దేశంలో ఇష్టారీతిగా ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై ధరాభారం మోపడం సిగ్గుచేటని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా, తెలంగాణ యాసంగి వడ్లు ఒక్క కిలో కూడా తీసుకోము అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పినందుకు నిరసనగా, పెట్రోల్ ,డీజిల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మియాపూర్ ఎక్స్ రోడ్డు జాతీయ రహదారిపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ రాస్తారోకో చేశారు.
నల్ల బ్యాడ్జీలు, నల్ల షర్ట్ లు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నల్ల జెండా ఎగురవేసి, కేంద్ర బీజేపీ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల నిరంకుశంగా వ్యవరిస్తుందని, తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనకుండా, రాష్ట్రం కొనే అవకాశం లేకుండా రైతు చట్టాలతో చేతులు కట్టేసిందని ఎద్దేవా చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను వ్యతిరేఖ వ్యవసాయ చట్టాల పేరుతో రోడ్లపై ఆందోళనల్లో కూర్చోబెట్టిన ఘనత బిజెపిదేనని అన్నారు. రైతులు కష్టపడి పండించిన వరి పంట ను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్ధృతంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రం చేస్తున్న ఈ గందరగోళాన్ని తొలగించి ప్రజలకు, రైతులకు నిజాల్ని స్పష్టంగా తెలియజేయాలనే ఈ రైతు దర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, పూజిత జగదీశ్వర్ గౌడ్, రోజాదేవి రంగరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.