- పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని మోసం చేశారు
- శేరిలింగంపల్లిలో 28వేల మంది దరఖాస్తు
- నిర్మించింది 300 ఇళ్లు మాత్రమే
- అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టివ్వాల్సిందే
- బీజేపీ నాయకుల డిమాండ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి తెరాస ప్రభుత్వం మోసం చేసిందని శేరిలింగంపల్లి బీజేపీ ఇన్‌చార్జి గజ్జల యోగానంద్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఆ పార్టీ నాయకులతో కలిసి గుల్ మోహర్ పార్కులోని డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో 28వేల మందికి పైగా పేదలు డబుల్ బెడ్ రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 300 ఇళ్లను మాత్రమే నిర్మించారని ఎద్దేవా చేశారు. ఇది ముమ్మాటికీ తెరాస ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించడం తెరాస ప్రభుత్వానికి చేత కాదని విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అక్రమార్కులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ భూములకు పర్మిషన్ ఇప్పించి అక్రమ నిర్మాణాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని అన్నారు.
బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ స్థలంలో ఉండంగా స్థలాలు లేవని ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్ అవతల నిర్మాణాలు చేపట్టడం దారుణమన్నారు. ఇక్కడి వారికి వేరే ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడం కన్నా స్థానికంగా సర్వే నంబర్ 28, 100, ఇతర స్థలాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు.
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి వారికి కేటాయించాలని బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెరాస అనుకూల వ్యక్తులకు, కార్యకర్తలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించకూడదని, ఈ విషయమై బీజేపీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి నియోజవర్గ సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, మనోహర్, రాజశేఖర్, గోవర్ధన్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, మాణిక్యరావు, జయరాములు, శ్రీధర్, వినయ్, రాజు, యువమోర్చా అసెంబ్లీ కన్వీనర్ జితేందర్, నాయకులు నరేందర్ ముదిరాజ్, మారం వెంకట్ వరప్రసాద్, రవి గౌడ్, నారాయణ రెడ్డి, సురేష్ మట్ట, ఐటీ సెల్ అసెంబ్లీ కన్వీనర్ కళ్యాణ్, నాయకులు లక్ష్మణ్ ముదిరాజ్, రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, రామకృష్ణారెడ్డి, వినోద్, పవన్, బీజేవైఎం ఆనంద్, నాయకులు రాజు, శ్రవణ్, పాండే, విజయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శేరిలింగంపల్లి మండల ఎమ్మార్వోకి డబుల్ బెడ్ రూం ఇళ్లపై వినతిపత్రం అందజేశారు.