శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్లలోని ఓ దాబాలో బీసీ కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్పీ రంగారెడ్డి జిల్లా నాయకులు చేవెళ్ల పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నాయకులు పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ వీరా రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలని టీఆర్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠినమైన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులే ప్రజలపై దాడులకు పాల్పడే పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బండారి రమేష్ యాదవ్, నర్సింగ్ ముదిరాజ్, ముద్దెంగూడెం జనార్ధన్ ముదిరాజ్, బండారు విజయలక్ష్మి, వనం పద్మ, కూనుకుర్తి అశోక్ అడ్వకేట్, కావలి శంకర్ ముదిరాజ్, మొగుడంపల్లి రాజు, సబ్బగారి రాజు, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు గడ్డం చంద్రయ్య, రాజేంద్రనగర్ సీనియర్ నాయకుడు జయరాజ్, చేవెళ్ల మండల రజక సంఘం నాయకులు జంగయ్య, శ్రీనివాస్, ప్రశాంత్, శ్రీరాములు, గుండాల శ్రీనివాస్, నెలటా మాజీ ఉపసర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీఆర్పీ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్యాయంపై ప్రశ్నిస్తాం.. బాధితులకు అండగా నిలబడతాం.. న్యాయం జరిగే వరకు పోరాడతాం అని టీఆర్పీ నాయకులు స్పష్టం చేశారు.





