శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల గేటెడ్ కమ్యూనిటీల్లో చోటుచేసుకున్న గృహచోరీల నేపథ్యంలో చందానగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గృహచోరీలకు పాల్పడుతున్న ముఠాల కదలికలు, వారి పనితీరుపై అవగాహన కల్పిస్తూ గేటెడ్ కమ్యూనిటీల వాసులు, సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. ఈ సందర్భంగా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన గేటెడ్ కమ్యూనిటీలను పోలీసులు సందర్శించి.. సెక్యూరిటీ సిబ్బంది, అపార్ట్మెంట్ మేనేజ్మెంట్లతో సమావేశమయ్యారు. రాత్రి వేళల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని, సీసీ కెమెరాల నిఘాను పెంచాలని సూచించారు.

సోమవారం తెల్లవారుజామున 2:56 గంటల నుంచి 4:46 గంటల మధ్య చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని Flotilla Gated Apartments, C-Block, Flat No.403లో చోరీ జరిగిందని, గుర్తుతెలియని వ్యక్తులు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి, ఫ్లాట్ తాళం పగలగొట్టి ఇంట్లోని నగదు, విలువైన వస్తువులను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే తరహాలో సెప్టెంబర్ 23న కూడా మరో గృహచోరీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వరుస ఘటనలను దృష్టిలో ఉంచుకుని గేటెడ్ కమ్యూనిటీల్లో రాత్రి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. నివాసితులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలను పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు, కిటికీలు, బాల్కనీలను పూర్తిగా లాక్ చేయాలని, ఇంట్లో అధిక మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులు ఉంచకుండా జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇంట్లో లేని సమయంలో వారావారీగా, ఎక్కువ రోజుల పాటు బయట ఉండాల్సి వస్తే సెక్యూరిటీ సిబ్బందికి ముందుగా సమాచారం ఇవ్వాలని, ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలని, అలర్ట్ సిస్టమ్లు ఉంటే వాటిని సక్రమంగా వినియోగించాలని సూచించారు.

అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంట్రీ రిజిస్టర్లను కచ్చితంగా నిర్వహించాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే వ్యక్తులు, వాహనాల వివరాలను నమోదు చేయాలని పోలీసులు సూచించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రతి ప్రవేశాన్ని నిశితంగా పరిశీలించాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా ఇతర కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చందానగర్ పోలీసులు సూచించారు. అనుమానం వచ్చిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి.. అప్రమత్తతతోనే గృహచోరీలను అరికట్టవచ్చు అని చందానగర్ ఎస్హెచ్ఓ ఎ. శ్రీధర్ కుమార్ తెలిపారు.






