శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంసీ కమిషనర్ సృజన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 49 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి 44 ఫిర్యాదులు వచ్చాయి. ఇంజినీరింగ్ విభాగానికి 2, అర్బన్ బయోడైవర్సిటీ విభాగానికి 2, రెవెన్యూ (ప్రాపర్టీ ట్యాక్స్) విభాగానికి 1 ఫిర్యాదు అందింది.

ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును కమిషనర్ సంబంధిత అధికారుల సమక్షంలో పరిశీలించారు. సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలన జరిపి, అవసరమైన చర్యలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని శాఖల అధిపతులను ఆదేశించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ, ట్రాకింగ్ లింక్ కేటాయిస్తున్నట్లు సీఎంసీ అధికారులు తెలిపారు. వీటి ద్వారా ఫిర్యాదుదారులు తమ సమస్యపై తీసుకుంటున్న చర్యలు, పరిష్కార పురోగతిని తెలుసుకోవచ్చు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన, స్పందించే, సమర్థవంతమైన పౌర సేవలు అందించడంపై సీఎంసీ దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.





