శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): భగత్ సింగ్ ఆశయస్ఫూర్తితో దేశభక్తిని చాటుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాలని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా మియాపూర్ ముజాఫర్ కార్యాలయం వద్ద నిర్వహించిన నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనం సుధాకర్ మాట్లాడుతూ.. పంజాబ్‌లోని బంగా గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా చిన్న వయసులోనే పోరాడారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం, ప్రజల సమానత్వం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.

దేశంలో ప్రస్తుతం పాలకులు కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. భగత్ సింగ్ ఆశయాల స్ఫూర్తితో మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాల్సిన అవసరం ఉందని వనం సుధాకర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తన ఆధీనంలో ఉంచుకుని మెజార్టీ ప్రజల ఓట్లను తొలగించే ప్రక్రియకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రజల ఓట్ల తొలగింపునకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాలకవర్గాల విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తితో దేశభక్తియుత పోరాటాలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
జి. శివాని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కుంభం సుకన్య, గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, గ్రేటర్ కమిటీ సభ్యులు అంగడి పుష్ప, దేవపూజ మధుసూదన్, సభ్యులు రజియా, అమీనా, సుల్తానా బేగం, కొడిపాక రాజు, శంకరయ్య, ఆనంద్, రాజు తదితరులు పాల్గొన్నారు.





