నడిగడ్డ తండాలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై గిరిజనుల ఆగ్రహం

శేరిలింగంప‌ల్లి, జూలై 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నడిగడ్డ తండాలో సీఆర్పీఎఫ్ క్యాంప్ కారణంగా ఎదురవుతున్న సమస్యల‌ను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం నాయకులు స్పష్టం చేశారు. నడిగడ్డ తండా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయిని రత్నకుమార్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు సభవత్ హన్మ నాయక్, కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా నడిగడ్డ తండాలో వెనుకబడిన వర్గాల ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. తండా అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేసి మౌలిక సదుపాయాలు సాధించుకున్నామని, ఆ పోరాటాల్లో పలువురు పురుషులు, మహిళలు కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించినప్పటికీ, 2016లో తండా ముందు సీఆర్పీఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయని ఆరోపించారు. గతంలో నిర్మించుకున్న ఇళ్లను మరమ్మత్తు చేయడం లేదా పునర్నిర్మించుకోవడానికి సీఆర్పీఎఫ్ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్‌కు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఈ పోరాటానికి తండా ప్రజలందరూ ఐక్యంగా సిద్ధంగా ఉండాలని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు రెడ్డి నాయక్, జాయింట్ సెక్రటరీ డి. చందు, కోశాధికారులు దేవా నాయక్, లక్షపతి నాయక్, మాదిలేటి, నరసింహ, సుధాకర్, లక్ష్మణ్ నాయక్, సోమేశ్వరరావు, బాలు నాయక్, కమలాకర్, ఆంజనేయులు, తిరుపతి రాథోడ్, రవీందర్ నాయక్, మోతిరామ్, కృష్ణ, హరి, బాషా, మాన్యతోపాటు మహిళా సంఘం నాయకులు ఎస్. సునీత, చాంది బాయి, రాజి బాయి, బుజ్జి బాయి, సాలి బాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here