శేరిలింగంపల్లి, ఏప్రిల్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, చిరు వ్యాపారులకు అధికారిక గుర్తింపు కల్పించే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) 300 మంది రిసోర్స్ పర్సన్స్ (RPs), స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని CMC కమిషనర్ సృజన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (UCD) సుభద్రా దేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్ (UCD) ఇందిరా మేరీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) రిజిస్ట్రేషన్ కోసం భారత ప్రభుత్వం జూలై 2020లో ప్రారంభించిన అధికారిక పోర్టల్. ఇది వ్యాపారాలకు అధికారిక గుర్తింపుతోపాటు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పూర్తిగా ఉచితం. అత్యంత సులభం, వేగవంతమైన ప్రక్రియ. దీనికి ప్రాథమిక వ్యాపార వివరాలు ఉంటే సరిపోతుంది. ప్రొప్రైటర్‌షిప్‌లు, పార్టనర్‌షిప్‌లు, కంపెనీలు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, సేవా రంగాల వారికి ఇది అందుబాటులో ఉంటుంది. శిక్షణలో పాల్గొన్న వారికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ప్రాధాన్యత రంగాల కింద తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. పేటెంట్లు, ISO సర్టిఫికేషన్, ఇతర సేవలపై సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేందుకు మినహాయింపులు ఇస్తారు. సకాలంలో చెల్లింపుల రక్షణ (45 రోజుల్లోపు బకాయిలు చెల్లించేలా రక్షణ) లభిస్తుంది.
లైసెన్సులు, ఇతర అనుమతులు సులభంగా పొందవచ్చు. SHG సభ్యులు, స్వయం ఉపాధిపై దృష్టి పెడతారు. ఈ కార్యక్రమం ద్వారా SHG సభ్యులను పలు విధాలుగా బలోపేతం చేయాలని CMC లక్ష్యంగా పెట్టుకుంది. వారి వ్యాపారాలను సూక్ష్మ పరిశ్రమలు (Micro Enterprises)గా నమోదు చేయడం, అధికారిక ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందేలా చేయడం, ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలను, వ్యాపార అవకాశాలను విస్తరించడం, శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్స్, సైబరాబాద్ వ్యాప్తంగా ఉన్న SHG సభ్యులకు ఈ పథకంపై అవగాహన కల్పించి, వారందరూ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రోత్సహించడం చేస్తారు.





