- పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు
- అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బంది ఐడీ కార్డులను ధరించాలి
- కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
- సాధారణ ప్రజలకు కేంద్రాల వద్ద అనుమతి నిరాకరణ
- ఫలితాల అనంతరం నుంచి 48 గంటల పాటు ర్యాలీలపై నిషేధం
- శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు వైన్ షాపులు, బార్ల మూసివేత
- సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాలు
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ మేరకు సీపీ సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు. పటాన్‌చెరు సర్కిల్‌కు చెందిన ఓట్లను చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డీఆర్‌సీ సెంటర్‌లో లెక్కించనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పీజేఆర్ స్టేడియం వైపు వాహనాలను అనుమతించడం లేదు. సరస్వతి విద్యామందిర్ జంక్షన్ నుంచి పైప్‌లైన్ రోడ్డు, గీతా టాకీస్ మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. అలాగే హుడా కాలనీ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. శివాజీనగర్ వీకర్ సెక్షన్ కాలనీ వద్ద, ప్రైమరీ స్కూల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.
కాగా కూకట్‌పల్లి సర్కిల్‌కు చెందిన ఓట్లను కూకట్‌పల్లిలోని సమతానగర్‌లో ఉన్న రిషి ఎంఎస్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన డీఆర్‌సీ సెంటర్‌లో లెక్కిస్తారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. బ్రౌన్ బియర్ బేకరీ జంక్షన్ నుంచి సమతా నగర్ రోడ్డు మీదుగా కాలేజీ వరకు ట్రాఫిక్‌ను అనుమతించరు. అలాగే అల్లాపూర్ జంక్షన్, నిజాం పేట రోడ్డు, శ్రీనివాస స్టేషనరీ షాప్, ప్రగతి నగర్ రోడ్డు, భాగ్యనగర్ హిల్స్, కూకట్‌పల్లి నుంచి కాలేజీ వైపుకు ట్రాఫిక్‌ను అనుమతించరు. దీంతోపాటు కోనసీమ వంటిల్లు జంక్షన్, రచ్చబండ గ్రౌండ్, ఎంఎన్ఆర్ కాలేజీల నుంచి రిషి కాలేజీకి ట్రాఫిక్‌ను అనుమతించరు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో డీఆర్‌సీ సెంటర్‌లకు వచ్చే అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బంది విధిగా ఐడీ కార్డులను ధరించాలి. ఐడీ కార్డు లేని వారిని లోపలికి అనుమతించరు. వారి వెంట సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలు, ఇంక్ పెన్‌లను తీసుకెళ్లడానికి వీలు లేదు. అలాగే లెక్కింపు కేంద్రాల వద్దకు సాధారణ ప్రజలను అనుమతించరు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం 48 గంటల వరకు ర్యాలీలను నిషేధించారు. గెలుపొందిన అభ్యర్థులు కానీ, ఇతరులెవరైనా సరే.. ర్యాలీలు నిర్వహించరాదు. నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
కాగా ఓట్ల లెక్కింపు కారణంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులను, బార్‌లను మూసివేయనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మియాపూర్‌లోని బీకే ఎన్‌క్లేవ్‌లో ఉన్న సెంటియా ది గ్లోబల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ పార్టీ చందానగర్ డివిజన్ అభ్యర్థి కసిరెడ్డి సింధురెడ్డిలు గురువారం సందర్శించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వారి వెంట కౌంటింగ్ ఏజెంట్లు, పార్టీ నాయకులు ఉన్నారు.